హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే ఒక కాలేజీ ఏర్పాటు కాగా, కొత్తగా మరో 9 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు కాగా, వీటిని ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్చేస్తారు. వీటిల్లో పాలిటెక్నిక్ కోర్సులతో పాటు ఇంజినీరింగ్ కోర్సులు నిర్వహిస్తారు. మాసాబ్‌ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్(మారేడ్‌పల్లి), కులీకుతుబ్‌షా పాలిటెక్నిక్ ఓల్డ్‌సిటీ కాలేజీలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో విద్యారంగ సంస్కరణలపై చర్చ జరిగింది. ఆయా కాలేజీల ఏర్పాటును వేగవంతం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. సమావేశాల అనంతరం ఫైల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలనకు పంపిస్తారు. ఈ తొమ్మిది ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
కొత్తగా రెండు ఆర్జీయూకేటీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఆర్జీయూకేటీలు ఏర్పాటుకానున్నాయి. వీటిని ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. విద్యాశాఖ అధికారులు విద్యాసంస్కరణ క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. వెయ్యి సీట్లతో ఒక్కో కాలేజీని ప్రారంభించేందుకు అనుమతించాలని నివేదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బాసరలో ఆర్జీయూకేటీని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మూడు ఆర్జీయూకేటీలుండగా, రాష్ట్ర విభజనతో రెండు ఏపీకి వెళ్లడంతో ఉన్న ఒక్క ఆర్జేయూకేటీపై అధిక ఒత్తిడిపడుతున్నది. సీట్ల కోసం తీవ్రమైన డిమాండ్ ఉంటుంది. దీంతో కొత్తగా రెండు ఆర్జీయూకేటీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ఈ ఆర్జీయూకేటీ ఉండగా, దక్షిణంలో మహబూబ్‌నగర్, తూర్పున ఖమ్మంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆర్జీయూకేటీలు బాసర ఆర్జీయూకేటీ కిందే నడుస్తాయి. ఆ వైస్చాన్స్లరే ఈ రెండింటిని పర్యవేక్షిస్తారు. ఒక్కో ఆర్జీయూకేటీ నిర్మాణానికి రూ.400కోట్లు అవసరమవుతాయని, ఏడాదికి రూ.100కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిలోనూ ఆరేండ్ల బీటెక్ కోర్సులను నిర్వహించనుండగా, 10 జీపీఏ ఆధారంగా సీట్లను భర్తీచేస్తారు.