Sangareddy | సంగారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ – కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు.
ఈ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. తరుచుగా చెక్‌పోస్టులను తనిఖీలు చేసి, ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే సరిహద్దుల్లో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద ఇప్పటి వరకు రూ. 2.41 కోట్ల నగదు, రూ. 24.77 లక్షల విలువ చేసే మద్యం, రూ. 4.51 కోట్ల విలువ చేసే 6 కిలోల బంగారం, రూ. 19.60 లక్షల విలువ చేసే 21 కిలోల వెండిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 348 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు గట్టి నిఘా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు.