NIMS | ఖైరతాబాద్, జూన్ 17 : ఉన్నత ఉద్యోగాలు.. గౌరవప్రదమైన వేతనం.. నిరుద్యోగుల బంగారు భవితకు నిమ్స్ మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సు బాటలు వేస్తోంది. వైద్యశాలగానే కాదు.. వైద్య కళాశాలగానూ నిమ్స్ ప్రత్యేక చాటుకుంటున్నది. రెండేండ్ల వ్యవధి గల ఈ కోర్సుతో పాటు ఆర్నెళ్ల ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ఫార్మసీ, బీమా, మెడికల్ టూరిజం, మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ హెల్త్ కేర్, ఐటీ రంగంలో అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం నిమ్స్ ఎంహెచ్ఎం కోర్సు ఇంచార్జిగా డాక్టర్ మార్త రమేశ్ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఎంహెచ్ఎం కోర్సుకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. 20 పరిమితమైన సీట్ల ఉండగా, వైద్య, వేద్యేతర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తును ఈ నెల 28 సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాలి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 2 సాయంత్రం 5గంటల లోపు హార్డ్ కాపీలను ఆస్పత్రిలో సమర్పించాలి. ఇతర వివరాలకు 040-23489189, నిమ్స్ అధికారిక వెబ్ సైట్ www.nims.edu.in ను సంప్రదించాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ పేర్కొన్నారు.