NIA | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్, సమీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) లోతుగా ప్రశ్నిస్తున్నది. ఏపీలోని విజయనగరంలో సాగుతున్న ఈ విచారణలో అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. నిందితుల అరెస్టుకు ముందు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 20 మంది కుర్రాళ్లు సమీర్ ఇంట్లో సమావేశయ్యారని ఎన్ఐఏ దృష్టికి వచ్చినట్టు సమాచారం. దీని ఆధారంగా దర్యాప్తు అధికారులు ఆ 20 మంది కుర్రాళ్ల కోసం వేట కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
వారితోపాటు వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్ కోసం కూడా ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ సిబ్బంది గాలిస్తున్నారు. సికింద్రాబాద్ బోయగూడలోని రైల్ కళారంగ్ బస్తీకి చెందిన సమీర్‌కు అంతర్జాతీయ ఉగ్రలింకులు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఇప్పుడు అతను ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. ఆ సమాచారం ఆధారంగా దర్యాప్తు అధికారులు కళారంగ్ బస్తీకి చెందిన పలువురిని రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. ఆ బస్తీలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.