హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం షో కాజ్ నోటీసులు జారీచేసింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివేదికపై జాతీయ మానవ హక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది.
మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రీమియర్ షోకు పోలీసుల అనుమతి లేకుంటే హీరో, అతని అభిమానులు ఎందుకు వచ్చారో తెలియడం లేదని పేర్కొంది. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదని అభిప్రాయపడింది. ఆరు వారాల్లోపు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సీఎస్‌ను ఆదేశించింది.