హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సరోగసీ ఘటనలో ఒడిశాకు చెందిన ఓ యువతి ఈ నెల 25న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. యువతి ఆత్మహత్యను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ.. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు ఎఫ్ఐఆర్ స్థితి, తెలంగాణలో సరోగసీ పేరుతో మహిళలపై ఏమైనా వేధింపులు జరిగాయా? ఎవరైనా ఫిర్యాదు చేశారా? చేస్తే వాటి స్థితి ఏంటి? అనే వివరాలు ఇవ్వాలని కోరింది. హైదరాబాద్లోని రాయదుర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన మానవ హకుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. ఒడిశాకు చెందిన ఓ యువతి సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు ఒప్పుకోగా.. వారితో ఆ డీల్ చేసుకున్న వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో.. ఆ యువతి భరించలేక భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.