సుల్తాన్‌బజార్, జూలై 2. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మహేందర్‌రావు పుట్ట గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 17 వేల మందికిపైగా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎనహెచ్ఎం ఉద్యోగుల్లో రెండు నెలలుగా కొందరికి, మరికొందరికి గత నెల వేతనాలు ఇప్పటికీ జమకాలేదని తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు పగలూరాత్రి తేడా లేకుండా సేవలందిస్తున్నారని, వారికి జీతాలు అందకపోవడంతో నిరాశా, నిస్పృహలకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు, సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎదురుచూస్తున్న 180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్ అమలు, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, జీవో నం.1195ను పునఃసమీక్షించి వేతనాలు పెరుగాల్సిన వారికి సవరించిన వేతనాలు, తగ్గిన వారికి గతంలో పొందుతున్న వేతనాలనే కొనసాగించాలని కోరారు.