హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్‌రోడ్ దక్షిణ భాగం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల సంస్థ చౌటుప్పల్- ఇబ్రహీంపట్నం- కందుకూరు- ఆమనగల్- శంకర్పల్లి- సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్ తయారీ బాధ్యతలను ఇంటర్ కాంటినెంటల్ కన్సల్టేషన్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఆగస్టు 18న ఉత్తర్వులు జారీచేసింది.
దక్షిణ భాగం ట్రిపుల్ఆర్ను భారత్‌మాల ఫేజ్-2 కింద చేపడుతున్నామని, దీనిని పూర్తిగా ఎక్స్‌ప్రెస్‌వే ఎకనామిక్ కారిడార్‌గా నిర్మిస్తున్నట్టు తెలిపింది. దక్షిణ భాగం ట్రిపుల్ఆర్ కూడా నిర్మిస్తేనే రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రయోజనం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. సీఎం కేసీఆర్ లేఖలు కూడా రాశారు. ఎట్టకేలకు కేంద్రం దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది.