హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయ్యంతో చేపట్టబోతున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనుల్లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగితే తప్పకుండా విచారణ జరుపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తేల్చి చెప్పింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం పనులు చేపడితే తమ వద్దకు రావాలని పిటిషనర్ అయిన బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డికి సూచించింది. ఈ మేరకు ఎన్జీటీ జ్యుడిషియల్ సభ్యులు పుష్ప సత్యనారాయణ, సాంకేతిక సభ్యులు ప్రశాంత్ గర్గవ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం అనుమతులు పొందే దశలో పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని స్పష్టం చేసింది.
పనులు ప్రారంభమయ్యాక పర్యావరణ, జలవనరుల, జీవవైవిద్య ఉల్లంఘనలు జరిగితే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు కార్తీక్‌రెడ్డిని అనుమతించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జీ రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పొందకుండా మూసీ అభివృద్ధి పనులు చేపట్టడం చట్టవ్యతిరేకమని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత ప్రాంతాలకు 10 కి.మీ. పరిధిలో చేపట్టే పనులపై పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయాలన్న నిబంధనను రేవంత్ సర్కార్ ఉల్లంఘించిందని వివరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్‌లోని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు అభిప్రాయపడ్డారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, ఈ తీర్పుపై పునరాలోచించాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు.
రేవంత్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని బకాయిలు విడుదల చేయకుండా పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా హైకోర్టు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించి.. నిధుల విడుదలకు ఆదేశాలని ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.