హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్‌లకు మోక్షం లభించింది. మంగళవారం ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంగా ఈ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ట్రిబ్యూనల్ తీర్పు వెలువరించినట్టు అధికారులు తెలిపారు. పర్యావరణానికి హాని చేకూరుతుందనే కారణంతో కొంతకాలం క్రితం గోదావరి నదీ పరివాహకంలో కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలోని 25 ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను ఎన్జీటీ నిషేధించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 76 రీచ్‌లకుగాను 19 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీటీ అనుమతితో మరో 25రీచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే నదిలో నీటి ప్రవాహం కారణంగా ఈ 25 రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు కొంత సమయం పడుతుందని వారు తెలిపారు. ఇటీవల టెండర్లు ఖరారైన మేడిగడ్డ ప్రాజెక్టులోనూ నీటి ప్రవాహం కారణంగా ఇసుక తవ్వకాలు ఇంకా ప్రారంభం కాలేదు.