హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అనాథలు, అభాగ్యుల పేరిట పలు స్వచ్ఛంద సంస్థలు నిధులు వసూలు చేసి స్వాహా చేస్తున్నాయని హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కుటుంబం ఉన్న పిల్లలను అనాథలుగా చూపించి విదేశీ నిధులను కాజేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ తరహా ఆరోపణలను ఎదురొంటున్న ఆపరేషన్ మొబిలైజేషన్ (ఓఎం) ఆఫ్ ఇండియా గ్రూప్ ఆఫ్ చారిటీస్కు చెందిన ఆస్తులు అన్యాక్రాంతం చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆస్తులను అమ్మేయడానికి ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్ నిర్వాహకులు కుట్ర చేస్తున్నారంటూ సికింద్రాబాద్కు చెందిన గౌరిపాగ ఆల్బర్ట్ లాజెల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కోరిన పిటిషన్ను జస్టిస్ నగేశ్ భీమపాక బుధవారం విచారించారు.
సీనియర్ న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపిస్తూ, సంస్థ నిర్వహణ పారదర్శకంగా లేదని తెలిపారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్ట ఉల్లంఘన జరుగుతున్నదని చెప్పారు. దీనిపై 2023లో దర్యాప్తు చేసినప్పటికీ విదేశీ నిధుల సేకరణ నియంత్రణ అంశం జోలికి వెళ్లలేదని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి నిధులు వస్తుంటాయని చెప్పారు. ఈడీ ఆస్తులను జప్తు చేసినప్పటికీ నిర్వాహకులు ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ తరఫు ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా స్పందిస్తూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలు, సీబీఐ, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్కు నోటీసులు ఇచ్చింది. అభియోగాలు ఎదురొంటున్న చారిటీస్ ఆస్తులు అన్యాక్రాంతం చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.