Weather | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్లో 22 నుంచి మూడురోజులపాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని పేర్కొంది.
అలాగే మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వడగండ్ల వానలు పడతాయని తెలిపింది. ఇదిలా ఉండగా, బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా 41.3, నిజామాబాద్ 41.2, కొమురంభీం ఆసిఫాబాద్ 41.1, నాగర్కర్నూల్, జోగులాంబ-గద్వాల్ 41, జగిత్యాల జిల్లాల్లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.