TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం డాల్టన్‌గంజ్ (జార్ఖండ్)కు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని.. ఉత్తర ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ దిశగా కదులుతూ ఈ నెల 27 నాటికి అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశాలున్నాయని తెలిపింది. ఈశాన్య అరేబియా నుంచి ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మీదుగా పరిసర ప్రాంతాల మీదుగా వాయుగుండం కేంద్రం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్లపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.