యాచారం, డిసెంబర్ 21: బంగారు ఆభరణాలు, నూతన పట్టువస్ర్తాలతో వధువు పారిపోయిందని వరు డు పెట్టిన కేసులో మంగళవారం కొత్త ట్విస్టు చోటుచేసుకున్నది. వరుడికి హైదరాబాద్లో పెద్ద ఇల్లు, గ్రామం లో స్థిరాస్తులు బాగా ఉన్నాయని నమ్మించి మోసగించి పెండ్లిచేశారని వధువు పోలీసులతో వాపోయింది. సీఐ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వయసు దాటిపోతున్నా పెండ్లి కుదరకపోవడంతో తన బంధువు ద్వారా బ్రోకర్లను ఆశ్రయించాడు. విజయవాడలో ఎవరూ లేని యువతిని ఒప్పించి పెండ్లి చేస్తామనడంతో రూ.1.70 లక్షలు మధ్యవర్తులకు ఇచ్చాడు. విజయవాడలో ఓ అమ్మాయిని చూపించి ఓ లాడ్జిలో ఇద్దరికి గురువారం వివాహం చేశాడు. శుక్రవారం యాదగిరిగుట్టకు దంపతులకు వ్రతం చేయించాడు. నవ దంపతులతోపాటు మధ్యవర్తులు వరుడు స్వగ్రామమైన కుర్మిద్దకు రాత్రిపూట చేరుకున్నారు. పెళ్లి కొడుకు ఇంట్లో బీరువా సర్దుతున్నట్టు నటించి నవ వధువు రూ.50 వేల విలువజేసే పట్టువస్ర్తాలను, 1.5 తులాల బంగారాన్ని వధువు బ్యా గులో పెట్టుకున్నది. తలనొప్పిగా ఉన్నదని, ట్యాబ్లెట్ తెమ్మని వరుడిని బయటకు పంపింది. అతను వచ్చేలోపు నాగమణి కారులో పరారైంది. పెండ్ల్లికోసం రూ.3 లక్షల వరకు ఖర్చుచేశానని, తనను మోసగించిన వారి చర్యలు తీసుకోవాలని నవ వరుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మంగళవారం పోలీసులతో మాట్లాడిన వధు వు తననే మోసం చేశారని తెలిపింది. వరుడికి కుర్మిద్ద లో పెద్ద ఇల్లు ఉన్నదని, స్థిరాస్తులు, భూములున్నాయ ని, నగరంలో సొంత ఇల్లుందని చెప్పి పెండ్లికి ఒప్పించినట్టు పేర్కొన్నది. వివాహం అనంతరం గ్రామానికి వెళ్ల గా అక్కడ పెద్ద ఇల్లు లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని, నగరంలో ఇల్లు ఉండగా గ్రామానికి ఎందుకొచ్చావని అడగ్గా సమాధానం చెప్పలేదన్నారు. ఇవన్నీ మాయమాటలని ఆస్తులు లేవని గ్రహించి అతడితో పెండ్లి ఇష్టంలేక తిరిగి వెళ్లిపోయినట్టు తెలిపింది. తాను బంగారం, దుస్తులు దొంగిలించలేదని, పెండ్ల్లిలో పెట్టిన పుస్తెమెట్టెలు, చేతిరింగు, కట్టు బట్టలతో వెళ్లినట్టు వివరించారు. తన పరువు తీసిన వన వరుడితోపాటు మధ్యవర్తులపై తానే ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించింది.