మారేడ్‌పల్లి, జూన్ 7: భార్య, బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గోవా యాత్రకు వెళ్లేందుకు పయనమైన నవవరుడిని మృత్యువు వెంటాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కదిలే రైలు ఎక్కుతుండగా కాలుజారి కిందపడ్డ ఆ యువకుడు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … వరంగల్‌కు చెందిన సాయి (28) ప్రై వేటు ఉద్యోగి. అతడికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. భార్య, బావ మరిది, ఇద్దరు స్నేహితులతో కలిసి గోవా వెళ్లాలని అనుకున్నాడు.
వరంగల్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అందరూ వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ ఎక్కి సీట్లలో కూర్చున్నారు. రైలు ఇంకా కదలకపోవడంతో వాటర్ బాటిల్ కోసం సాయి కిందకు దిగగా, రైలు కదలడంతో రైలు లోపల ఉన్న స్నేహితులు స్టాప్ చైన్ లాగారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆ ఇద్దరిని రైలు నుం చి కిందకు దించి.. చైన్ ఎందుకు లాగారంటూ విచారించారు. తమ ఫ్రెండ్ వాటర్ బాటిల్ కోసం కిందికి దిగాడని, రైలు కదలడంతో.. ఆపడం కోసం చైన్ లాగామని సాయి స్నేహితులు చెప్పారు.
ఇంతలో సా యి కూడా అక్కడికి వచ్చి పోలీసులతో మాట్లాడుతుండగా, రైలు మళ్లీ కదిలింది. సాయి భార్య మాధురి, బావమరిది రైలులోనే ఉండిపోవడం తో… హడావుడిగా సాయి పరిగెత్తుకెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నిం చగా, ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్ఫారం మధ్య గ్యాప్‌లో పడిపోయాడు. ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.