Zoo Park | హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని, వాటిలో మెరుగైనవి, మన రాష్ట్రానికి అనువుగా ఉన్న వాటిని అనుసరించాలని సూచించారు.
స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్లో ఉంచాలని, అర్బన్ ఫారెస్టీని అభివృద్ధి చేయాలని చెప్పారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, సంస్థలను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్ నెస్ సెంటర్ అనంతగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.