హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రస్తుతం అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో కొత్త విధానాలు, మార్గదర్శకాలతో కూడిన ‘వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక గ్యారెంటీ మిషన్ (గ్రామీణ)’(వీబీ-జీ రామ్ జీ) పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర సర్కార్ ముసాయిదా సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తూ.. ఈ పథకంపై ప్రజాభిప్రాయలు, సూచనలు స్వీకరిస్తున్నది.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలపై దేశంలోని సాధారణ ప్రజలు, మేధావులు, సామాజిక విశ్లేషకులు తమ అభిప్రాయాలు, సలహాలు, లేదా అభ్యంతరాలు కేంద్రానికి పంపవచ్చు. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా తమ స్పందన తెలియజేయాల్సి ఉంటుంది. గ్రామీణ ఉపాధి కల్పనలో రాబోయే ఈ మార్పులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మేధావులు తమ విలువైన అభ్యంతరాలు, సూచనలను suggestionvbgramg@gov.inకు పంపాలని అధికారులు కోరారు. ప్రజాభిప్రాయాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తుది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నది.