Telangana | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో కొత్త టెన్షన్ మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. పైగా వారు అమిత్‌షా సభ జరిగే రోజే పోటీ సభ నిర్వహించి ఇతర పార్టీల్లో చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి నిద్ర కరువైందని సమాచారం. సాధారణంగా అమిత్ షా వస్తున్నాడంటేనే పార్టీలో చేరికలు ఉంటాయని ఢిల్లీ పెద్దలు భావిస్తుంటారని, ఈసారి చేరికలు లేకపోగా ముఖ్య నేతలే వెళ్లిపోతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నట్టు తెలుస్తున్నది. షా రాకముందే తమకు షాకులు తగిలితే.. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారట.
ఇప్పటికే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో అమిత్ షా క్లాస్ పీకి వెళ్తున్నారని నేతలు చెప్పుకుంటున్నారు. నేతలు ప్రజల్లో ఉండకుండా హైదరాబాద్‌లో తిష్ట వేస్తున్నారని ఒకసారి, నేతల మధ్య సమన్వయం లేదని, చేరికలు లేవని, ప్రజల్లో పరపతి పెరగడం లేదని.. ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లారని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే పొంగులేటి చేరికపై రాష్ట్ర నేతలు బిల్డప్ ఇచ్చి అమిత్‌షాతో ఖమ్మంలో బహిరంగసభ పెట్టేందుకు ఒప్పించారు. చివరికి పొంగులేటి తూచ్ అనడంతో ఆ సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలోనే మరోసారి అమిత్ షా ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తుందేమోనని రాష్ట్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.