Telangana Thalli | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తాం. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తాం. ఇందుకోసం రాష్ట్రంలోని అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకొని, ప్రజాభీష్టం మేరకు మార్పులు చేస్తాం’ ఇది ఫిబ్రవరి 4న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం చేసిన ప్రకటన. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో వారంరోజుల్లో సచివాలయానికి తరలిస్తారని చెప్తున్నారు. ఇక్కడే అసలు విషయం దాగున్నది. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందన్న విషయం ప్రజల్లో పెద్ద ప్రశ్నగా మారింది. అన్నివర్గాల ప్రజల అభిప్రాయం తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం.. ఎందుకు గుట్టుగా డిజైన్లు సిద్ధం చేయించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు నిర్ణయించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఈ కమిటీ సమావేశాలపై ఒకటిరెండు సార్లు మాత్రమే అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఆయా సమావేశాల్లోనూ తెలంగాణ లోగో, రాష్ట్ర గీతంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ జరిగినట్టు నామమాత్రంగా కూడా సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా విగ్రహమే తయారైంది. ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలతో సంప్రదింపులు ఎప్పుడు జరిపిందని, సలహాలు, సూచనలు తీసుకొని మార్పులు, చేర్పులు ఎప్పుడు చేసిందనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నది. ఎవరెవరిని సంప్రదించారు? ఆయా వర్గాల ప్రతినిధులుగా ఎవరు హాజరయ్యారు? అన్న విషయాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.
గతంలో బీఆర్ఎస్ రూపొందించిన విగ్రహంపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్.. ఇపుడు ఎవరినీ సంప్రదించకుండా ఎందుకు తుదిరూపు ఇచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని చెప్పి.. ఎవరి మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఏవైనా లోపాలు ఉన్నా ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ విగ్రహం రూపురేఖలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.