హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీలు, సీపీలు, అదనపు ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఎన్నికల ప్రవర్తనా నియామవళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, కొత్త వ్యూహలను అమలు చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను, సమాచారాన్ని కవర్ చేసేందుకు మీడియా సహకరించాలని కోరారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. నగదు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని డీజీపీ అంజనీ కుమార్ వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో 700 మంది పోలీసు అధికారులను బదిలీ చేశామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లో 80-85 చెక్ పోస్టులను ఏర్పాటుచేసి, సీసీ టీవీ కెమెరాలను అమర్చినట్టు చెప్పారు. ఎన్నికలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశ్చిమబెంగాల్ సీఈవో ఆరిజ్ అఫ్లాబ్, భద్రతకు సంబంధించిన ప్రణాళికలు, వ్యూహాల గురించి తమిళనాడు సీఈవో సత్యబ్రత సాహో వివరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు సంజయ్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్, అడిషనల్ సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.