హైదరాబాద్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర పరిధిలోని ఖాజాగూడ, ల్యాంకోహిల్స్ ప్రాంతాల్లో కొత్త రాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. ఇవి దాదాపు 4,000 నుంచి 6,000 ఏండ్ల కాలానికి చెందినవిగా భావిస్తున్నట్టు తెలిపారు. గురువారం తమ బృందం ఆయా ప్రాంతాల్లోని మెహర్బాబా, అనంతపద్మనాభస్వామి కొండలను పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్త రాతియుగపు మానవులు తమ రాతి గొడ్డళ్లను పదును పెట్టుకోగా ఏర్పడిన ఆనవాళ్లను గుర్తించినట్టు చెప్పారు. పద్మనాభస్వామి ఆలయదారికి రెండువైపులా ఉన్న సహజసిద్ధమైన నాగపడిగెలాంటి రాతి బండల కింద తాత్కాలికంగా నివసించే ఆనాటి మానవులు రాతి పనిముట్లకు పదును పెట్టేవారని తెలిపారు.
మెహర్బాబా గుహకు ఎగువన 50 మీటర్ల దూరంలో నాలుగు చోట్ల 30, 20 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు, 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతున రాతి గాడులు ఉన్నాయని వివరించారు. వాటి ఆకారం, అరగదీసిన తీరును బట్టి, ఇవి కొత్త రాతియుగం కాలానికి చెందినవేనని చెప్పారు. గతంలో నార్సింగి, కోకాపేట, జూబ్లీహిల్స్, బీఎన్ఆర్ హిల్స్ తదితర ప్రాంతాల్లో కొత్తరాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఖాజాగూడ కొత్త రాతియుగపు ఆనవాళ్లను కూడా కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఆరియాలజిస్టులు మైత్రేయి, దుర్గ, నయన్, సాక్షి, కిరణ్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.