హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ) : పొరుగు రాష్ట్రం ఏపీ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే మన రాష్ట్రం మాత్రం నూతన ఇసుక పాలసీ పేరుతో సజావుగా సాగుతున్న ప్రక్రియను మరింత జటిలం చేసింది. ఫలితంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రవాణాదారులకు కూడా గిట్టుబాటుకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో లారీ యజమానులు మరో గత్యంతరం లేక పొరుగు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. నిర్మాణ రంగానికి ఇసుక ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. నిత్యం వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే నెపంతో కాంగ్రెస్ సర్కారు నూతన ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. దీంతో గతంలో టన్ను ఇసుక రూ. 1400-1500 ఉండగా, నూతన పాలసీ పుణ్యమా అని ఇసుక ధరలు భారీగా పెరిగిపోయాయి. ఒక దశలో ఇసుక ధరలు టన్నుకు రూ. 2000-2300 వరకు ఎగబాకాయి. అంతేకాదు, ఇసుక రీచ్‌ల వద్ద రకరకాల ఆంక్షలు విధించడం, లోడింగ్‌లో జాప్యం చేస్తుండటంతో ఇసుకకు కృత్రిమ కొరత ఏర్పడింది. ఇసుక లారీలకు పోటీగా ప్రభుత్వమే ఇసుకను విక్రయించేందుకు హైదరాబాద్‌లో శాండ్ బజార్లను ఏర్పాటుచేసి అధికారికంగానే ఇసుక ధరను రూ. 1600-1800గా ఖరారు చేసింది.
జీఎస్టీ, రవాణా, లేబర్ చార్జీలు దీనికి అదనం. ఈ శాండ్ బజార్లలో నాసిరకం ఇసుకను విక్రయిస్తుండటంతో నిర్మాణదారులు ప్రైవేటు అడ్డాల నుంచే ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలావుంటే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రం గతంలో ఉన్న ఇసుక పాలసీని రద్దుచేసి ఉచితంగా ఇసుకను అందిస్తున్నది. దీంతో లారీల యజమానులు కోదాడ మీదుగా ఏపీ నుంచి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రోజూ వందల సంఖ్యలో నగరానికి ఏపీ ఇసుక వస్తుండడంతో ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని నిర్మాణదారులు చెప్తున్నారు. ఏపీ నుంచి ఇసుక తేస్తేనే తమకు గిట్టుబాటు అవుతున్నదని ఇసుక లారీల యజమానులు చెప్తున్నారు. మన రాష్ట్రంలో టన్ను ఇసుకకు రూ. 400 వరకూ టీజీఎండీసీకి చెల్లించాల్సి వస్తున్నదని, లోడింగ్‌కు రెండు రోజుల సమయం పడుతున్నదని పేర్కొన్నారు. జాప్యం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని, అంతేకాకుండా ఓవర్ లోడింగ్ పేరుతో రకరకాల ఆంక్షలు విధిస్తున్నారని, ఎక్కువ లోడింగ్ ఉన్నా జరిమానాలు విధిస్తున్నారని వాపోయారు. ఏపీ నుంచి ఇసుకను తెస్తే దూరం కొంత పెరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు ఉండడంలేదని, అక్కడ వెంటనే లోడింగ్ అవుతున్నదని చెప్తున్నారు. దీనివల్ల శాండ్ బజార్లలో ప్రభుత్వం విక్రయిస్తున్న ధరకే తాము నాణ్యమైన ఇసుకను వినియోగదారుల ఇంటివద్దకు చేర్చగలుగుతున్నట్టు వివరించారు.
రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల వద్ద లారీలపై ఆంక్షలను ఎత్తివేసి లోడింగ్ వెంటనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇసుక లారీల యజమానుల సంఘం విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఇసుక రీచ్‌ల వద్ద డ్రైవర్లు, సిబ్బంది కోసం తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఏపీ మాదిరిగా ఇసుక ఉచితంగా ఇవ్వకున్నా, తనిఖీల పేరుతో లారీ యజమానులను ఇబ్బందులపాల చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.