హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలపై బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌లో వ్యా పారులు, మిల్లర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా రెండు నిబంధనలను వారు తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. గత యాసంగికి సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబర్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసిన సదరు సంస్థ.. బుధవారం పౌరసరఫరాల భవన్లో కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆసక్తిగల వ్యాపారులతో ప్రీబిడ్ మీటింగ్‌ను నిర్వహించింది. వరుసగా మూడేండ్లపాటు వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లు ఉండాలని అర్హతల్లో నిబంధన పెట్టింది. అది కూడా నిత్యావసర సరుకుల వ్యాపారం (కమాడిటీస్ ట్రేడింగ్)లో మాత్రమే ఉండాలని మెలిక పెట్టింది. దీనిపై రాష్ట్ర మిల్లర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం టెండర్లలో పాల్గొనకుండా తమను నిరోధించేందుకే ఈ నిబంధన పెట్టారని విమర్శిస్తున్నారు. బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీకి స్థానికంగా ఏడాది నుంచి ఆఫీసు ఉండాలని అధికారులు మరో నిబంధన పెట్టారు. దీనిపై ఇతర రాష్ర్టాల వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గ్లోబర్ టెండర్లు పిలిచి స్థానికంగా ఏడాది నుంచి ఆఫీసు ఉండాలన్న నిబంధన విధించడం ఏమిటని వారు ప్రశ్నించినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా ఎక్కడైనా వ్యాపారం చేసే తాము ప్రతి రాష్ట్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేము కదా? అని ప్రశ్నించినట్టు వినికిడి. దీనిపై అధికారులు స్పందిస్తూ.. టెండర్లు దక్కించుకున్న తర్వాత ఏమైనా సమస్యలు వస్తే ఆయా వ్యాపారుల కోసం తాము ఇతర రాష్ర్టాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అందుకే ఇక్కడ ఆఫీసు ఉండాలన్న నిబంధన పెట్టామని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.