Registration Charges | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం పరిస్థితిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని హితవు చెప్తున్నారు. చార్జీలు పెంచే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సమావేశం నిర్వహించి, భూముల మార్కెట్ విలువల సవరణపై చర్చించనున్నారు.
తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, సెజ్‌లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా ఉండి, భూముల ధరలు క్రమంగా పెరుగుతున్న, తగ్గుతున్న గ్రామాలను గుర్తిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారుల కు సమీపంలో ఉన్న గ్రామాలను ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల బహిరంగ ధరలను లెకలోకి తీసుకుని మారెట్ విలువను సవరిస్తారు. వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి వివరాలు సేకరించి ధరలను సవరిస్తారు. పట్టణ ప్రాంతాల్లో.. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, వసతులు, అంతర్గత సదుపాయాలు, మౌలిక వసతులు వంటివి పరిగణనలోకి తీసుకొని ప్రాంతాలవారీగా విలువలను నిర్ణయిస్తారు. మారెట్ విలువల సవరణను ఈ నెల 23 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు ఏమైనా ఉంటే 25వ తేదీ వరకు సమీక్షిస్తారు. ఆ తర్వాత కమిటీ ఆమోదం కోసం పంపుతారు. ఈ నెల 29న కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత.. సవరించిన విలువలను జూలై 1న వెబ్సైట్లో ప్రచురిస్తారు. జూలై 20 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటి ఆధారంగా ధరల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి.. జూలై 31న వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ మరుసటి రోజు నుంచి.. అంటే ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమల్లోకి రానున్నాయి. స్టాంపు డ్యూటీ పెంచుతారా? లేదా? అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ప్రస్తుతం మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 5.5 శాతంగా ఉన్నది. దీనికి ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.5%, రిజిస్ట్రేషన్ చార్జీలు 1.5% కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు మార్కెట్ విలువలో 7.5 శాతంగా ఉన్నది.
కొంతకాలం ఆగితే నయం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రియల్ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని వ్యాపారులు, మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ బాగా పెరిగినప్పుడో, క్రయవిక్రయాలు జోరుమీద ఉన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెద్దగా ప్రభావం కనిపించదని చెప్తున్నారు. కానీ, రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు, కొత్త ప్రభుత్వాలు, ఎన్నికల కోడ్ వంటి పరిణామాలు, ఇతర కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉన్నదని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య సగటున 23% తగ్గుదల నమోదైందని ఉదహరిస్తున్నారు. గత మూడు నెలల్లో గమనించినా 20% తగ్గుదల ఉన్నదని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపు సరైన నిర్ణయం స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా పిల్లల పై చదువుల కోసం ఆస్తుల విక్రయం, పిల్లల చదువులపై పెట్టుబడి పూర్తయితే కొత్త ఆస్తుల కొనుగోలు, సెలవుల నేపథ్యంలో కుటుంబాలకు ఎక్కువగా తీరిక సమయం దొరకడం తదితర కారణాల వల్ల మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లావాదేవీలు అత్యధికంగా ఉంటాయని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో తిరోగమనం నమోదవడం మంచి సంకేతం కాదని హితవు చెప్తున్నారు. కాబట్టి మార్కెట్‌కు జోష్ వచ్చేలా చేసి, ఆ తర్వాత ధరలు సవరించాలని సూచిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆదాయ లక్ష్యం.. 21 వేల కోట్లు?
మార్కెట్ ధరలను కనిష్ఠంగా 20%, గరిష్ఠంగా 40% వరకు సవరించే అవకాశం ఉన్నది తెలుస్తున్నది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్థిక మంత్రి వివిధ విభాగాల అధిపతులతో బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పెంచబోయే ధరలకు అనుగుణంగానే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఈసారి మార్కెట్ ధరల సవరణ నేపథ్యంలో ఆదాయ లక్ష్యం రూ.21 వేల కోట్ల వరకు ఉండొచ్చని చెప్తున్నారు. నిరుడు రూ.14,295 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది కనీసం రూ.19-20 వేల కోట్ల వరకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.