హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్‌కార్డుల్లో కోత ఖాయమైంది. పది లక్షల కొత్త కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు సగం కోత పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల రేషన్‌కార్డులు మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 18న జిల్లాలవారీగా అర్హుల జాబితాను సిద్ధంచేసిన ప్రభుత్వం ఇదే జాబితాను జిల్లాలకు పంపించినట్టు తెలిసింది. ఈ జాబితా ప్రకారమే గ్రామసభల్లో చర్చించి కొత్త కార్డులు జారీ చేయనున్నది.
కొత్త కార్డుల జారీ కోసం ప్రభుత్వం కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలిసింది. ఈ సర్వేలో రేషన్‌కార్డు లేదని తెలిపిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. కులగణన సర్వేలో కొత్త కార్డుల కోసం 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో సుమారు 10 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉన్నదని పలు సందర్భాల్లో మంత్రులు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు వీటిని వివిధ కొర్రీలతో వడపోయగా 6.68 లక్షల మందిని అర్హులుగా తేల్చింది.
కొత్త రేషన్‌కార్డుల జారీకి కులగణన సర్వేను లింకు చేయడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు రానివారి నుంచి గ్రామసభల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇది కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, కోపాన్ని తగ్గించడానికేనని, గ్రామసభల్లో స్వీకరించనున్న దరఖాస్తులకు ఇప్పట్లో మోక్షం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆరోగ్యశ్రీతో ఇతర పథకాలకు రేషన్‌కార్డు లింకును తొలగిస్తామని పేర్కొన్నది. ఇందులోభాగంగా రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులను (ఏటీఎం మాదిరిగా) జారీ చేస్తామని వెల్లడించింది. కానీ, ఇప్పుడు స్మార్ట్‌కార్డులపై ప్రభుత్వం సప్పుడు చేయడం లేదు. పాత పద్ధతిలోనే రేషన్‌కార్డులను జారీచేస్తున్నది.