హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని, పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లపై మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించడం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన రెండు లైన్లను విస్మరించి, హైదరాబాద్- అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుపై ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టంలోనే ఈ ప్రతిపాదన ఉందని, ఇందులో సీఎం రేవంత్ గొప్పదనం ఏమీలేదని దుయ్యబట్టారు.
కరీంనగర్ నుంచి హుజూరాబాద్ మీదుగా కాజీపేట, ఆదిలాబాద్- నిర్మల్- ఆర్మూ ర్ వచ్చే రైల్వే లైన్లకు తాను ఎంపీగా ఉన్నప్పుడే సర్వే, డీపీఆర్ చేయించినట్టు గుర్తు చేశారు. ఇవి పూర్తయితే రాష్ట్రంలో పది జిల్లాలలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రెండు కొత్త రైల్వే లైన్లు చేపట్టాలని సీఎం, సీఎస్, ఎస్సీఆర్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాదరి బాలమల్లు పాల్గొన్నారు.