Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): ఒకవైపు ప్రభుత్వ నిబంధన, మరోవైపు బ్యాంకు అధికారుల వ్యవహార శైలితో రూ.2 లక్షలకుపైగా పంట రుణాలు ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు ఆ పై మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తేనే రూ.2 లక్షలు మాఫీ చేస్తామని, లేదంటే మాఫీ వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే మెలిక పెట్టింది. దీంతో ఆయా రైతులు అప్పో సప్పో చేసి, రెండు లక్షలకు మించి ఉన్న బ్యాలెన్స్‌ను చెల్లించేందుకు బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే, బ్యాంకు అధికారులు మాత్రం నిరాకరిస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి.
‘రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న మొత్తాన్ని ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని బ్యాంకు అధికారులు చెప్తున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లాలో పలు బ్యాంకులు రైతులను వెనక్కి పంపించినట్టు సమాచారం. దీంతో తాము రుణం చెల్లిస్తామంటే ఎందుకు తీసుకోరంటూ రైతులు బ్యాంకర్లతో ఘర్షణలకు దిగుతున్నారు. మీరు కట్టించుకోకపోతే తమకు రుణమాఫీ ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం తమకేమీ తెలియదని, తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చేతులెత్తేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూ.2 లక్షల వరకు, ఆ తర్వాత రూ.2 లక్షలకుపైగా రుణాలు గల రైతులకు రుణమాఫీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్యాంకు అధికారులకు ఇబ్బందేమిటి?
రైతులు రుణాలు చెల్లిస్తామంటే బ్యాంకు అధికారులు ఎందుకు తీసుకోవడం లేదనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆరా తీస్తే.. ‘రుణ లక్ష్యం’ నిబంధనల కారణంగానే బ్యాంకు అధికారులు రుణాలు కట్టించుకోవడం లేదని తెలిసింది. ఒకవైపు రుణమాఫీతో భారీగా డబ్బు బ్యాంకుల్లో జమవుతున్నది. తిరిగి రుణాలు తీసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటున్నది. దీంతో ఆయా బ్యాంకుల్లో రుణా లు తగ్గిపోతున్నాయి. ప్రతి బ్యాంకుకు రుణ లక్ష్యం ఉం టుంది. ఒకవేళ ఆ లక్ష్యం నెరవేరకపోతే బ్యాంకు అధికారుల కెరీర్లో ఇబ్బందులు ఏర్పడుతాయని, అందుకే బ్యాంకు అధికారులు రైతుల నుంచి డబ్బులు కట్టించుకోవడం లేదని తెలిసింది.
ఇప్పటికే అరకొరగా రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ నిబంధనతో ఆ కొద్ది మందికి కూడా రుణమాఫీ అయ్యే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం రుణమాఫీలో కోతలపై కోతలు పెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు రూ.1.5 లక్షల వరకు రుణం ఉన్నవారిలో 17.75 లక్షల మందికి మాత్రమే రూ.12 వేల కోట్లు మాఫీ చేసింది. సుమారు 70 లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా అర్హతల పేరుతో 32 లక్షల మందికే పరిమితం చేసినట్టు తెలిసింది.