హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కో, సింగరేణి సంస్థల మధ్య కొత్త పంచాయితీ నెలకొన్నది. ఒప్పందంలో పేర్కొన్న గ్రేడ్ కాకుండా నాసిరకం బొగ్గు సరఫరా చేయడం.. రెండు సంస్థల మధ్య కోల్వార్కు దారితీసింది. జెన్కోకు రాష్ట్రంలో 10 థర్మల్ విద్యుత్తు కేంద్రాలున్నాయి. వీటికి సింగరేణి బొగ్గే ప్రధాన వనరు. అయితే ఒప్పందం ప్రకారం సింగరేణి జీ8, జీ9 గ్రేడ్ల బొగ్గును సరఫరా చేయాలి. కానీ నాసిరకం బొగ్గు అయిన జీ11, జీ 13, కొన్నిసార్లు జీ15 గ్రేడ్ బొగ్గును కూడా సరఫరా చేస్తున్నట్లు జెన్కో వర్గాలంటున్నాయి. నాణ్యమైన బొగ్గును ప్రైవేట్‌కు విక్రయించి, నాసిరకం బొగ్గును తమకు అంటగడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ముఖ్యంగా ఇల్లందు, సత్తుపల్లి నుంచి నాసిరకం బొగ్గు వస్తున్నదని.. భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్లకు అనేక సమస్యలే గాక సంస్థకు నష్టాలొస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే గ్రేడింగ్ విషయంలో తాము అనేక జాగ్రత్తలు తీసుకుంటూ, థర్డ్ పార్టీ తనిఖీలు కూడా చేస్తున్నామని సింగరేణి వర్గాలంటున్నాయి. బొగ్గు ధరలు తగ్గించేందుకూ అంగీకరించామని పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలోనే అతిపెద్ద థర్మల్‌ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ ప్లాంట్(వైటీపీఎస్)కు బొగ్గు ఎక్కడినుంచి తీసుకోవాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వైటీపీఎస్‌లోని రెండు యూనిట్లకు ప్రస్తుతం సింగరేణియే బొగ్గు సరఫరా చేస్తున్నది. మొత్తం ఐదు యూనిట్లు పూర్తిస్థాయిలో నడవాలంటే రోజుకు 50వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. అంటే సింగరేణి రోజుకు 12-14 రైల్వే ర్యాక్‌ల బొగ్గు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రోజుకు నాలుగు ర్యాక్‌లు మాత్రమే సరఫరా చేస్తున్నది. డిసెంబర్ కల్లా రోజుకు అవసరమైన బొగ్గు ప్లాంట్‌కు చేరితేనే అన్ని యూనిట్లు నడుస్తాయి. అయితే సింగరేణి ఆమేరకు సరఫరా చేస్తుందా? అనేది అధికారులను వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్లాంట్‌కు సరిపడా బొగ్గును సింగరేణి అందించలేదని భావిస్తున్న జెన్కో అధికారులు ప్రత్యామ్నాయంగా ఇతర సంస్థల నుంచి బొగ్గు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.