హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ప్రభుత్వం కొత్త ఆప్షన్ను జోడించింది. ‘సోల్డ్ ఔట్’ ఇబ్బందులు, ‘99999’ పేరుతో వచ్చిన ఖాతాల పరిషారానికి రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొందరు రైతులు ధరణి రాకముందు తమ వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని నాలా కన్వర్షన్ చేయించి చదరపు అడుగుల చొప్పున అమ్మేశారు. విక్రయించగా మిగిలిన భూమి పట్టా భూమిగా ఉన్నది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా వీరికి ధరణిలో పాత విస్తీర్ణం ప్రకారమే వివరాలు నమోదయ్యాయి. కొత్త పట్టాదారు పాస్బుక్ మంజూరు అయింది.
అయితే కొంత భూమిని అమ్మేసిన నేపథ్యంలో ధరణిలో ఇలాంటి ఖాతాలకు ‘సోల్డ్ ఔట్’ అని నమోదయ్యింది. దీంతో రైతులు ఆ భూమికి క్రయవిక్రయాలు జరిపే అవకాశం లేకుండా పోయింది. రైతుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం పరిషారానికి ధరణిలో ట్రాన్సాక్షన్ మాడ్యూల్ 33లో (టీఎం-33) కొత్త ఆప్షను జత చేసింది. సోల్డ్ ఔట్ ఉన్న ఖాతాల రైతులు ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పాస్బుక్ వివరాలతో పాటు తమ భూమిలో ఎంత మేర విక్రయించారో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి.
అధికారులు వాటిని పరిశీలించి ఆ మేరకు విస్తీర్ణాన్ని తొలగించి మిగిలిన విస్తీర్ణంపై నిషేధా న్ని ఎత్తివేస్తారు. మరోవైపు, భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరు రైతులు తమ భూముల వివరాలను సమర్పించలేదు. వారు ఆ గ్రామంలో దీర్ఘకాలంగా లేకపోవడం లేదా ఎవరైనా రైతు మరణిస్తే వారసులుగా స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాకపోవడం వంటి సందర్భం లో అధికారులు ఆ ఖాతాకు తాతాలికంగా ‘99999’ నంబర్ వేసి ధరణిలో అప్లోడ్ చేశారు.
ఆ తర్వాత కొందరు రైతులు ఆ భూమి తిరిగి తమ పేరు మీదికి మార్చాలంటూ దరఖాస్తులు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఖాతాల ప్రక్షాళన ప్రారంభించింది. అకడ పని పూర్తికావటంతో మిగతా జిల్లాల్లోనూ ‘99999’ ఖాతాలను పరిషరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భూమి తమదేనని రైతులు దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి.. సరైనవైతే పట్టా జారీ చేయాలని పేరొన్నది.