హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ సరార్ అని చెప్పుకునే బీజేపీ రాష్ర్టాల్లో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయని, అనేక సమస్యలతో దేశం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మణిపూర్‌లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రధాని మోదీ అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్ పరిస్థితులు తమ రాష్ట్రాలకు వ్యాపిస్తాయేమోనని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ..
ఇతర దేశాలు అభివృద్ధి విషయంలో రాకెట్లా దూసుకుపోతుంటే మన దేశం మాత్రం ఎందుకు వెనుకబడుతున్నదని ప్రశ్నించారు. బీజేపీ సెంటిమెంట్‌తో గెలుస్తున్నది తప్ప అభివృద్ధిని పూర్తిగా పకన పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి విషయంలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదాన్ని దేశమంతా గమనిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ అన్నీ రాష్ట్రాలకు విస్తరిస్తున్నదని తెలిపారు. మోదీని గద్దె దింపే సరైన నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తున్నదని, ఆ నాయకుడు సీఎం కేసీఆర్ అని బలంగా విశ్వసిస్తున్నదని అన్నారు.
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా బుధవారం పార్లమెంట్ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎంపీలు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, రంజిత్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు.