Congress Govt | సూర్యాపేట, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు. మరోవైపు విద్యార్థులకు అందించే ఆహార పరిమాణాన్ని తగ్గించడం విమర్శల పాలు చేస్తున్నది. వాస్తవానికి కొత్త మెనూ అమలు కావాలంటే మార్కెట్ ధరలకు అనుగునంగా రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.100 ఇవ్వడంతోపాటు హాస్టళ్లలో మౌలిక వసతులు, సిబ్బందిని సమకూర్చాల్సి ఉన్నది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు వార్డెన్లు వినతిపత్రాలను అందిస్తూ తమకు ఎదురవుతున్న సమస్యలను విన్నవిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు 2015లో అప్పటి సీఎం మెస్ చార్జీలను 45 నుంచి 50 శాతానికి అదనంగా పెంచారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటివరకు అదే అమలు అవుతున్నది. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక హాస్టళ్లలో తరుచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రోజుకు రూ.100 ఇస్తేనే సాధ్యం
కొత్త మెనూ అమలుకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ.100 చొప్పున ఇస్తేనే సాధ్యమవుతుందని వార్డెన్లు చెప్తున్నారు. 2015కు ముందు ప్రీ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.450 నుంచి 500 ఉండగా, కాలేజీ విద్యార్థులకు రూ.800 వరకు ఉండేది. ఆనాటి పీఓం కేసీఆర్ ప్రీమెట్రిక్ విద్యార్థులకు రూ.950, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,100 చొప్పున పెంచారు. కళాశాలల విద్యార్థులకు రూ.1,500 చొప్పున ఇచ్చారు. దాంతో రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, పప్పు, సాంబారు ఇస్తుండగా రాత్రి సమయంలో కూడా సన్న బియ్యంతో అన్నం, ఓ కూర, మజ్జిగతోపాటు వారంలో ఐదు రోజులు గుడ్డు, రెండు సార్లు నాన్‌వెజ్ అమలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 35 నుంచి 40 శాతం మెస్‌చార్జీలు పెంచినా విద్యార్థులకు అందించే మెనూ మాత్రం ఐదారింతలు ఉండటంతో అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నది.