New Liquor Policy | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఒక్క ఆగస్టులోనే రూ.30 వేల కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్సైజ్ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్‌అలీ ముర్తుజారిజ్వీ, కమిషనర్ హరికిరణ్ సమీక్షలో పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఆగస్టు చివరి నాటికి రూ.30 వేల కోట్లు చేతికి అందితే, ఆ నిధుల దన్నుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మాజీ సర్పంచ్‌లకు వారు చేసిన గ్రామాభివృద్ధి పనుల కింద చెల్లించాల్సిన రూ.1,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి అవసరమైన రూ.2,500 కోట్లతోపాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇవే నిధులను వినియోగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
నూతన ఎక్సైజ్ పాలసీ దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ-4 దుకాణాల లైసెన్స్ గడువును రెండేండ్ల నుంచి మూడేండ్లకు పెంచినట్టు తెలిసింది. దరఖాస్తు ఫారం ధరను రూ.3 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. లక్కీడిప్ ద్వారా లైసెన్సీలను ఖరారుచేయాలని, నూతన లైసెన్సీలు రిటైల్షాప్లకు ఒక ఏడాది ఎక్సైజ్ ఫీజును అడ్వాన్స్‌గా చెల్లించే విధంగా నూతన పాలసీని రూపొందించినట్టు తెలిసింది. లైసెన్స్ పొందిన దుకాణంలో మద్యం విక్రయాలు తక్కువగా ఉన్నాయని లైసెన్సీ భావిస్తే… రిటైల్షాప్ స్లాబ్ ధరలో 10% డబ్బును షిఫ్టింగ్ పన్నుగా చెల్లించి, అదే స్లాబ్ పరిధిలో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా దుకాణాన్ని బదిలీ చేసుకునే వెలుసుబాటు కల్పించనున్నారు.
ఆగస్టు రెండోవారంలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి, నెల చివరి వరకు టెండర్ల ప్రక్రియ ముగించేవిధంగా మద్యం పాలసీని రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం అందింది. లైసెన్సీలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్ధారించి, రిటైల్ షాపునకు నిర్ధారిత ఎక్సైజ్ ఫీజును ఏడాది కాలానికి సరిపడా అడ్వాన్స్‌గా తీసుకుంటారు. అయితే, లైసెన్స్ మాత్రం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
లైసెన్స్‌దారు ఏడాది ఎక్సైజ్ ఫీజును అడ్వాన్స్‌గా చెల్లించడం వల్ల రూ.24 వేల కోట్లు ముందుగానే ప్రభుత్వ ఖజానాలో జమ అవుతాయి. అయితే, ఫీజును బ్యాంకు గ్యారెంటీ ద్వారా తీసుకుంటారా? డీడీ ద్వారా తీసుకుంటారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పాత పాలసీలో 2,620 మద్యం దుకాణాలకు గాను దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, గౌడ రిజర్వేషన్లు కేటాయించిన దుకాణాల దరఖాస్తులకు అర్హతను స్థానిక స్థాయి నుంచి రాష్ర్టేతరానికి విస్తరించినట్టు తెలిసింది.
తహసీల్దార్ జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం ఉంటే చాలు, ఏ రాష్ర్టానికి చెందిన వారైనా టెండర్లలో పాల్గొని రిజర్వేషన్లు వినియోగించుకోవచ్చనే నిబంధనను పాలసీలో పొందుపరిచారు. పొగురు రాష్ర్టాల నుంచి 30 వేల నుంచి 50 వేల వరకు అదనపు దరఖాస్తులు వస్తాయని, అంతా కలిపి 2 లక్షలకుపైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినట్టు తెలిసింది. దరఖాస్తుల విక్రయాల ద్వారానే 6వేల కోట్లను రాబట్టేలా పాలసీని సిద్ధంచేసినట్టు సమాచారం.