హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వాహనదారులపై సర్కారు పన్నుల భారం మోపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వాహనాలతోపాటు పాత వాహనాలపై కూడా లైఫ్‌ట్యాక్స్‌ను పెంచింది. సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం కొన్నా.. దాని ఖరీదులో 17 శాతం పన్ను విధిస్తున్నది. గతంలో కొత్త మోటర్‌సైకిల్ ధర రూ.50వేలు దాటితే కేవలం 12 శాతం లైఫ్‌ట్యాక్స్ వసూలు చేసేవారు. ఇప్పుడు రెండేండ్ల పాత బైక్ కొన్నా 17శాతం పన్ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెకండ్ హ్యాండ్ కార్లపై 20 శాతం వరకు పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది.
రెండేండ్లు దాటిన వాహనాలపై పన్ను భారం తగ్గుతూ వచ్చేది. కానీ కానీ రేవంత్ సర్కార్ పెంచిన లైఫ్ ట్యాక్స్‌తో గతంలో కొత్త బండ్లకు చెల్లించే పన్నును మించి పాత వాహనాలకు చెల్లించాల్సి రావడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నగరలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం, హైడ్రా దుందుడుకు చర్యలతో భూముల విలువలు పడిపోవడం.. ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాక వ్యాపారాలు బోసిపోవడం వంటి చర్యల ప్రభావం వాహన రంగంపై పడింది. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నగరంలో తగ్గుతున్నాయని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు లభిస్తున్న సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తున్న తెలంగాణవాసులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే తక్కువ ధరకు బండి లభించిందన్న ఆనందం లైఫ్‌ట్యాక్స్ చెల్లింపుతో ఆవిరైపోతున్నదని వారు వాపోతున్నారు.