Kendriya Vidyalaya | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల బదిలీకి సంబంధించి కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు వివాదాస్పదమయ్యాయి. పదేండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లాల్సిందేనంటూ రూపొందించిన ఈ మార్గదర్శకాలను కేవీ టీచర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే టీచర్ల కొరత, నాణ్యతా ప్రమాణాల లేమితో కొట్టుమిట్టాడుతున్న కేవీలను బలోపేతం చేయాల్సింది పోయి ఇలాంటి మార్గదర్శకాలు ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 1,240 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా బోధన, బోధనేతర సిబ్బంది కలుపుకుని దాదాపు 50 వేల మంది పనిచేస్తున్నారు. వీరి బదిలీలకు సంబంధించి 2003-04 వార్షిక సంవత్సరంలో కేవీ సంఘటన్ బదిలీల విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని గత ఐదేండ్లలో నాలుగుసార్లు మార్చారు. తాజాగా, ఇటీవల కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. వీటిలో దాదాపు 20 నిబంధనలపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వీటిలో పదేండ్ల సర్వీసు పూర్తయిన వారిని దేశంలో ఎక్కడికైనా బదిలీ చేయడం, పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి కూడా మినహాయింపు ఇవ్వకపోవడం, 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న టీచర్లను మరోచోటికి బలవంతపు బదిలీ, క్యాడర్ వారీగా సర్వీసును లెక్కలోకి తీసుకోకపోవడం వంటివి ఉన్నాయి. స్పౌజ్, మ్యూచ్‌వల్, ఇంట్రాస్టేషన్ పాయింట్లను తొలగించడంపైనా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ మార్గదర్శకాలను నిరసిస్తూ జేఏసీ నేతలు మంగళవారం ఆందోళన బాట పట్టారు. కేంద్రీయ విద్యాలయ ప్రగతిశీల్ శిక్షక్సంఘ్ (కేవీపీఎస్ఎస్), ఆలిండియా కేంద్రీయ విద్యాలయ టీచర్స్ అసోసియేషన్ (ఏఐకేవీటీఏ), కేంద్రీయ విద్యాలయ నాన్ టీచింగ్ స్టాఫ్ అసొసియేషన్ (కేఈవీఐఎన్ఎస్టీఏ) నేతలు జాయిం ట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన బాట పట్టారు. కేవీల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బుధవారం కూడా దీనిని కొనస్తామని, రీజినల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని నేతలు తెలిపారు. నిరసన తెలిపిన వారిలో కేవీపీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సీతారాం, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాదరావు తదితరులు పాల్గొన్నారు.