హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో డొక్కు బస్సుల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నది. ఆర్టీసీలో డొకు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గత పదేండ్లలో ఏకంగా 6,680 డొకు బస్సులను ఆర్టీసీ తుకు కింద వేలం వేసి అమ్మేయగా, వాటిస్థానంలో 4,226 బస్సులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం వెంటనే తుకుగా మార్చాల్సిన 1,213 డొక్కు బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ఇటీవలే ఆర్టీసీ నివేదిక పంపింది.
పీఎం ఈ డ్రైవ్ పథకంలో హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్నది. నగరం అవసరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మరో 2,300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకునే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్లో వాహన కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో డీజిల్ బస్సులను నడపొద్దని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది. ఉన్న బస్సులను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులనే సమకూర్చుకోవాలని పేర్కొన్నది. ప్రస్తుతం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.1.85 కోట్ల వరకు ఉన్నది. అంత ఖర్చు భరించే పరిస్థితి లేనందున, గ్రాస్ కాస్ట్ మోడల్ పద్ధతిలో అద్దెకు తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది.