Congress Govt | హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించకుండా తొలి అడుగు వేసింది. ఇప్పుడేమో గొర్రెల పంపిణీ పథకంపైనే దుష్ప్రచారానికి తెగబడింది. రాష్ట్రంలోని గొర్రెల సంఖ్యపై ముఖ్యమంత్రి పౌరసంబంధాల అధికారి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా తగ్గిందని, కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం నిరుపయోగమైందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇందుకు వారి సొంత సర్వే, సొంత లెక్కల్ని జోడించారు.
రాష్ట్రంలో జీవాలు ఎన్ని ఉన్నాయనే అంశంపై కేంద్ర ప్రభుత్వం పశుగణన నిర్వహిస్తుంది. 2019లో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తదుపరి సర్వేను ఈ సెప్టెంబర్ నుంచి చేయనుంది. రాష్ట్రంలో గొర్రెలకు వ్యాక్సిన్ వేయాలన్నా కేంద్ర పశుగణననే ప్రామాణికంగా తీసుకుంటారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ హడావిడిగా ఈ మధ్య కాలంలో గొర్రెలు, మేకల సంఖ్యపై సర్వే చేయించింది. ఆఫీసు అవసరాల కోసం చేసిన ఈ సర్వేకు ఎలాంటి ప్రామాణికం లేదు. క్షేత్రస్థాయిలో తూతూ మంత్రంగా సర్వే పూర్తి చేసి కాగితాలపై లెక్కలు వేసి పంపించారనే విమర్శలూ ఉన్నాయి. సీఎం పీఆర్వో ఒకరు ఈ లెక్కల్ని ఉదాహరణగా చూపుతూ.. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1.24కోట్లకు తగ్గిపోయిందనే తప్పుడు ప్రచారానికి దిగారు. 2012లో రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు ఉండగా 2019లో ఇది 1.9 కోట్లకు పెరిగిందని చెప్పిన ఆయన.. 2019 నుంచి 2024 వరకు మాత్రం గొర్రెల సంఖ్య 1.24కి తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 2012-2019 లెక్కకు కేంద్ర ప్రభుత్వం చేసిన పశు గణన లెక్కల్ని పరిగణలోకి తీసుకున్న సదరు అధికారి, 2019-24 లెక్కలకు మాత్రం ప్రామాణికం లేనటువంటి పశుగణాభివృద్ధి సంస్థ చేసిన లెక్కల్ని పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.

రాష్ట్రంలోని గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు మాంసం లభ్యతను పెంచేందుకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 6వేల కోట్లు ఖర్చు చేసి 4.23లక్షల మందికి సుమారు 88 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనతో గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ పథకంలో భారీ అక్రమాలు జరిగాయనే ప్రచారం చేయించడంతోపాటు తాజాగా బడ్జెట్లో ఈ పథకానికి నయా పైసా కేటాయించలేదు. ఈ పథకం రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గొల్ల కురుమల నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సీఎం పీఆర్వో ఒకరు ఉద్దేశపూర్వకంగా ఈ పథకంపై దుష్ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.