Cyber Crime | (స్పెషల్ టాస్క్ బ్యూరో): హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ అదేస్థాయిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్, పిన్ నంబర్, సిమ్ స్వాప్, రాన్సమ్వేర్ మోసాలతో డబ్బులు దోచుకొనే కాలంపోయి ఇప్పుడు ఏకంగా ‘డిజిటల్ అరెస్టు’ వంటి నేరాలకు పాల్పడుతున్నారు.
ఏమిటీ డిజిటల్ అరెస్టు?
సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. మీ ఆధార్, సిమ్ కార్డు, బ్యాంకు ఖాతాలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఏదోవిధంగా వినియోగించబడ్డాయని నమ్మిస్తారు. నకిలీ పత్రాలను చూపిస్తారు. అలా తమ బుట్టలోకి మిమ్మల్ని లాగి.. విచారణ పూర్తయ్యేంతవరకూ వీడియో కాల్‌లోనే ఉండాలంటూ బెదిరిస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే దర్యాప్తు సంస్థకు, ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించాలని.. లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెడతారు. అలా మనిషిని స్క్రీన్ ముందు నుంచి ఎక్కడికీ వెళ్లనీకుండా ఓ విధంగా డిజిటల్ అరెస్టు చేసి తమ ఖాతాల్లోకి డబ్బు జమ కాగానే మాయమవుతారు. ఢిల్లీ, నోయిడా, ముంబై తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
మీరేంచేయాలి?
భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ లేదు. వీడియో కాల్లో విచారణ, దర్యాప్తు అనగానే భయపడొద్దు. వాళ్లు మిమ్మల్ని ప్రశ్నించడం కాదు.. మీరే వారి వివరాలన్నీ రాబట్టండి. విశ్వసనీయతను ప్రశ్నించండి. ఒకవేళ, నిజంగా తప్పు జరిగితే, ఇంటికి నోటీసులు పంపించాలని, లేదా దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో కలుసుకుందామని నిర్భయంగా చెప్పండి. అవసరమైతే, వీడియోకాల్‌ను రికార్డ్ చేయండి. ఎట్టిపరిస్థితుల్లో బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్‌తో ముడిపడిన వివరాలను బహిర్గతపర్చొద్దు.