Congress | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌కు నూతన సారథి, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో శుక్రవారం జోరుగా చర్చలు జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో మధ్యాహ్నం చర్చలు జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఫలితంగా ఈ నెలాఖరుకు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త నేతను ఎంపిక చేయాల్సి ఉంది. పీసీసీ రేసులో బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ ఉన్నారు. వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొన్నది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో అధిష్ఠానంతోపాటు రాష్ట్ర మెజార్టీ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.