Bhakta Ramadasu | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోని రావిచెట్టు కింద గుర్తించిన విగ్రహం భక్త రామదాసుదిగా భావిస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలిపారు. విగ్రహానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నేలకొండపల్లి స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్ స్థానిక పోలీస్టేషన్లో విగ్రహాన్ని గుర్తించారని తెలిపారు. కాసెపోసికట్టిన ధోవతితో, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా, అంజలిముద్రతో, మొన కిందికిపెట్టిన కత్తితో నిల్చుని, గోష్పాదశిఖతో కనిపిస్తున్న ఈ విగ్రహం రాజహోదాగల వ్యక్తిదని గుర్తించారు.
కుడి, ఎడమ భుజాలమీద చక్ర, శంఖాల ముద్రలున్నందున వైష్ణవ భక్తుడిదని భావిస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాసులు వివరించారు. ఈ శిల్పం రాజోచిత ఆహార్యంతో లేనందున అకన్న, మాదన్నది కాదని.. వారి మేనల్లుడు, భద్రాచల రామాలయ నిర్మాత, నేలకొండపల్లి వాసి భక్త రామదాసుది కావడానికి అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రామదాసు ఎలా ఉండేవాడు? ఆయ న ఆహార్యం ఏమిటి? అనేది వీడని ప్రశ్నగానే ఉన్న నేపథ్యంలో కళాకారుల ఊహల మేరకు ఇప్పటివరకూ అనేక రకాల రామదాసు విగ్రహాలను తయారు చేసుకున్న ట్టు చెప్పారు. ఆయన సమకాలికంగా తయారైన విగ్రహాలు వెలుగులోకి రాలేదని, నేలకొండపల్లి విగ్రహం రామదాసుదేనని అభిప్రాయపడుతున్నారు.