హనుమకొండ, నవంబర్ 17: సీసీఐ, దళారులు కలిసి పత్తి రైతును దగా చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోతే ఎంపీలు, వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పత్తి క్వింటాల్‌కు రూ. 8,110 మద్దతు ధర ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో రూ. 6 వేల నుంచి 7వేలకు అమ్మి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మొంథా తుపాన్ కారణంగా ఇప్పటికే అన్ని వర్గాల రైతులు నష్టపోయారని స్పష్టంచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 7 లక్షల మంది పత్తి రైతులు ఉంటారని, పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతుంటే రైతులు నష్టపోరా? అని దాస్యం ప్రశ్నించారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలుకు నిరాకరిస్తున్న సీసీఐ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
రైతు సమస్యలను పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులు రైతు సమస్యలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆసియాలోనే అతిపెద్ద మారెటైన వరంగల్‌కు తాము చెప్పే వరకు పత్తి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యధోరణి అర్థమవుతున్నదని దుయ్యబట్టారు.
రైతు ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ హత్యలేనని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. తేమ పేరిట కొనుగోళ్లు నిరాకరించడం, ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని సీసీఐ కొత్త నిబంధనలు పెట్టడం పత్తి రైతులకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నదని అన్నారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మారెట్ను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి పత్తి రైతులతో ప్రత్యక్ష మాట్లాడతారని తెలిపారు.