కడెం, ఆగస్టు 28: పారాణి ఆరకముందే ఓ నవ వధువు మృత్యువొడికి చేరింది. అత్తగారింటి వద్ద రిసెప్షన్ ముగించుకొని సొంతింటికి వస్తుండగా ప్రమాదంలో ఆమెతోపాటు తండ్రీ కన్నుమూశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం వాగువద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకొన్నది. కడెం మండలంలోని పాతమద్దిపడకు చెందిన కొండ రాజన్న-వసంతల కూతురు మౌనిక(26)కు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సాస్తి టౌన్‌షిప్‌కు చెందిన జనార్దన్‌తో ఈ నెల 25న వివాహమైంది. 27న మహారాష్ట్రలో రిసెప్షన్‌కు హాజరై శుక్రవారం రాత్రి ఇంటికి బయుల్దేరారు. పాండ్వాపూర్ చెక్‌పోస్ట్ దాటాక కడెం వాగు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెన గోడకు ఢీకొట్టి లోయలో పడింది. ప్రమాదంలో మౌనికకు తీవ్ర గాయాలై మృతిచెందింది. తండ్రి రాజన్నను దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశాడు. మౌనిక బంధు వు మెర్సి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ను నిజామాబాద్‌కు, మెర్సిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుడు జనార్దన్, మౌనిక తల్లి వసంత స్వల్పగాయాలతో బయటపడ్డారు.