వడ్డేపల్లి, జూన్ 1: పాలకులు, అధికార యంత్రాంగం ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించకపోతే జనం సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఒక్కోసారి పాలకుల నిర్లక్ష్యానికి మూల్యంగా కొందరు అభాగ్యులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి ఓ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. శాంతినగర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన తిరుపాల్(66) తీవ్రజ్వరంతో బాధపడగా కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ అని నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి విషమించి, తిరుపాల్ మృతిచెందాడు.
తిరుపాల్ అంత్యక్రియల అనంతరం శ్మశానం నుంచే ఆయన కుమారుడు దురేందర్యాదవ్ సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. ప్రభుత్వం, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మృతి చెందాడని ఆ వీడియోలో యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు. కాలనీలలో పారిశుధ్య పనులు చేయించడం లేదని చెప్పాడు. వర్షాలకు మురుగు ఎక్కడికక్కడ పేరుకుపోయిందని, అంటురోగాలు వ్యాప్తి చెందుతున్నాయని వివరించాడు.
ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో మగ్గిపోతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డాడు. మురుగునీరు రోజులతరబడి పేరుకుపోవడంతోనే దోమలు విజృంభించాయని, తన తండ్రికి డెంగీ సోకి మృతి చెందాడని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని కోరాడు. దురేందర్ తన తండ్రి మృతిపై ఆవేదన వ్యక్తంచేస్తూ విలపించడం.. నెటిజన్లను కంటతడిపెట్టిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పడకేసిందని, కనీసం పారిశుధ్య నిర్వహణకు కూడా సక్రమంగా జరగడంలేదని మండిపడుతున్నారు.