Ellampally Project | హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అవి కాళేశ్వరం జలాలు కావు’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి గప్పాలు తప్ప మరేమీలేదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును తా మే నిర్మించామని కాంగ్రెస్ సర్కారు చెప్తున్న గొప్పలన్నీ కూడా ఒట్టిమాటలే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసినా దానిని వినియోగంలోకి తీసుకురాలేదన్నది అంతే వాస్తవం.
జలయజ్ఞంలో భాగంగా 2004లో రూ.3,177 కోట్ల తో 20.16టీఎంసీల నీటి నిల్వసామర్థ్యంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ వచ్చేనాటికి ప్రాజెక్టుపై రూ.3,347.27 కోట్లు ఖర్చుపెట్టారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఏనా డూ ఆ రిజర్వాయర్‌లో 5 టీఎంసీలకు మించి జలాలను నిల్వ చేయలేదు. కారణం భూసేకరణ పూర్తి చేయకపోవటం, ముంపు బాధితులకు పునరావాసం కల్పించకపోవడమే. ప్రాజెక్టు కోసం మొత్తంగా 27,387ఎకరాల భూమిని సేకరించాల్సి ఉం డగా, 18,778 ఎకరాలను మాత్రమే సేకరించింది. ఇక పునరావాసం కల్పనకు 13,296 ఇండ్లను నిర్మించాల్సి ఉండగా, 1,448 ఇండ్లను మాత్రమే పూర్తిచేసింది. అదీగాక ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటినిల్వ వల్ల లక్షేటిపేట బ్రిడ్జి మునిగిపోయి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రూ.2,052.73 కోట్లను వాటి కోసం వెచ్చించింది. బరాజ్‌ను 2016లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇదీ వాస్తవం. కానీ అందుకు విరుద్ధంగా ప్రాజెక్టు మొత్తం పూర్తిచేశామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. అదీగాక ఎల్లంపల్లి నుంచే నీళ్లను తరలించామని చెబుతున్న మంత్రి పొన్నం వాటిని ఏవిధంగా తరలించారో కూడా చెబితే బాగుండేదని చురకలంటిస్తున్నారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని తెలంగాణవాదులు వివరిస్తున్నారు.
అం తేకాదు అంబేదర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్‌లోనే ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీబరాజ్, మిడ్‌మానేర్, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ భాగమై ఉన్నాయని అంగీకరించిన పొన్నం మరి ఆ యా రిజర్వాయర్లను నాడు ఎందుకు పూర్తి చేయలేదో కూడా చెబితే బాగుండేదని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ రీడిజైన్ ఫలితంగానే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో 14టీఎంసీలుగా నీటి నిల్వ సామ ర్థ్యం ఏకంగా 141టీఎంసీలకు పెరిగిందని తెలంగాణవాదులు గుర్తుచేస్తున్నారు. నీటి కొరత ఉన్న వేళ మేడిగడ్డ నుంచి, వరద వచ్చినప్పుడు ఎస్సారెస్పీ నుంచి, ఆ దిగువన ఎల్లంపల్లి నుంచి ఇలా బహుళ ప్రదేశాల నుంచి జలాలను తరలించుకునే అవకాశమున్న ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరమని, అది కేసీఆర్ రీడిజైన్ ఘనతని తెలంగాణవాదులు కొనియాడుతున్నారు.