Bhu Bharathi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ‘భూభారతి’ని తీసుకొస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూరికార్డులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొన్న సవాళ్లను ఇప్పుడు మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందని, పదేండ్ల క్రితంనాటి జంఝాటం మళ్లీ పునరావృతమవుతున్నదని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. భూభారతితో గ్రామాల్లో మళ్లీ వీఆర్వోలు రాజ్యమేలడం ఖాయమని, చేతులు తడపనిదే పనులు జరగని రోజులు మళ్లీ రాబోతున్నాయని రమేశ్ అనే ఓ నెటిజన్ కామెంట్ చేశారు. భూభారతితో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే పరిస్థితి రావొచ్చని వినీత్ అనే మరో నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉండగా మళ్లీ భూధార్ కార్డు ఎందుకని రాజు గొలుసుల అనే మరో నెటిజన్ ప్రశ్నించారు. దీని వల్ల డబ్బు, సమయం వృథా కావడమే తప్ప ఒరిగేదేమీ ఉండదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 2018లో భూధార్ భరోసా పేరిట భూధార్ కార్డులను తీసుకొచ్చిందని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే ఐడియాను కాపీ కొట్టిందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. గురువు బాటలో శిష్యుడు ప్రయాణిస్తున్నాడంటూ అప్పటి వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.