హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మా తాత అంటే మాతాత అని తల్లి, బిడ్డ గోముగా వాదులాడుకుంటున్న దృశ్యం నెటిజనుల మనసును దోచింది. ఆ తాత ఎవరో కాదు.. కేసీఆర్ తాత. సర్కారీ దవాఖానలో పురుడు పోసుకున్న తల్లికి ప్రభుత్వం తరఫున కేసీఆర్ కిట్ కానుకగా ఇచ్చారు. ఆ కిట్‌పై ఉండే కేసీఆర్ బొమ్మను చూస్తూ చిన్నారి మా తాత అని ముద్దులు కురిపించడం అందరినీ ఆకట్టుకొంటున్నది. ఆ ఆడపడుచుకు ‘మేనమామ’లా కేసీఆర్ అందించిన కానుక ఆ కిట్. మనుమనికి తాతతో వరస కుదిరింది. ఒక పథకం ప్రజల జీవితాలతో ఎంతగా మమేకమైతుందనడానికి ఈ కిట్ నిదర్శనం. శిశుర్వేత్తి అంటే ఇదే కదా! చూడముచ్చటగా ఉన్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరలైంది.
రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ కిట్‌పై ఉన్న సీఎం కేసీఆర్ ఫొటోను చూస్తూ చిన్నారి ‘తాతా’ అంటూ పలుకరించింది. తల్లి ఆ ఫొటోను చేతితో మూసేయగా ఆ చిన్నారి గట్టిగా అరిచి.. ఏడుపు మొదలుపెట్టింది. తల్లి చేయి అడ్డం తీయగానే చిన్నారి దగ్గరగా వెళ్లి సీఎం కేసీఆర్ ఫొటోకు ముద్దులు పెట్టింది. ‘తాత నాది’ అని ఆ తల్లి అంటే.. ‘కాదు నాది’ అని ఆ చిన్నారి అనడం చూస్తే ప్రతి ఒక్కరికీ కడుపు నిండినంత సంబురం అవుతుంది. ఈ వీడియో వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావును అమితంగా ఆకట్టుకున్నది. దీనిపై శనివారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ కిట్‌ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబురం చూస్తే మనసు పొంగిపోతున్నది. తల్లికి మేనమామగా.. బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ అందించిన కేసీఆర్ కిట్. ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది’ అని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
12.66 లక్షల మందికి కిట్
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా ప్రారంభించిన ‘కేసీఆర్ కిట్’ పథకం అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నది. మాతా శిశు సంరక్షణకు అద్భుతంగా సహాయపడటంతోపాటు.. గర్భిణులకు ఆర్థిక సాయం అందిస్తూ సీఎం కేసీఆర్‌ను మేనమామగా మార్చుతున్నది. బిడ్డ పుట్టిన తర్వాత వారి సంరక్షణకు అవసరమయ్యే వస్తువులతో కూడిన రూ.2 వేల విలువైన కిట్ బిడ్డలకు తాతయ్య ఇచ్చే ఆప్యాయతను అందిస్తున్నది. ఇప్పటివరకు 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్ పథకం కింద రూ.1261 కోట్ల ఆర్థిక సాయం అందింది. వారు రూ.263 కోట్లు విలువచేసే కిట్లు అందుకున్నారు. మొత్తంగా ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకానికి ఇప్పటివరకు రూ.1525 కోట్లు ఖర్చు చేసింది.