హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ‘ఫొటోల కోసమైతే మేం చర్చలకు రాం.. మా డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చుతామంటేనే చర్చలు’ అన్న ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో జేఏసీతో సర్కారు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. జేఏసీ నేతల అభ్యంతరాలు, అసంతృప్తులతో శనివారం(ఈ నెల 12న) జరగాల్సిన చర్చలను సర్కారు మొత్తంగా వాయిదావేసింది. శాఖల నుంచి వివరాలు రాకుండా, హెచ్వోడీలు లేకుండా చర్చలు చేస్తే ఏం లాభమని జేఏసీ నేతలు నిలదీసినంత పనిచేశారు. ఇదే విషయంపై ‘ఫొటోలు దిగేందుకైతే మేం రాం’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో గురువారం కథనం కూడా ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో చర్చలకు పిలిస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన సర్కారు పునరాలోచనలో పడింది. 57 డిమాండ్లపై నోట్లను సిద్ధం చేయిస్తున్నది.