హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): జీవో-317కు సంబంధించి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ క్యాటగిరీల్లో ఇప్పటివరకు బదిలీలను పూర్తి చేయని శాఖలు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని సర్కారు గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది. కానీ అందుకు సంబంధించిన ఫైల్ మాత్రం సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలో అడుగు కూడా ముందుకు కదలడంలేదు. దీంతో సొసైటీ గురుకుల టీచర్లు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం జీవో-317లో భాగంగా మెడికల్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీల్లో బదిలీలకు వేర్వేరుగా అనుమతులను జారీ చేసింది. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అందులో ఎన్నింటిని తిరస్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను డిపార్ట్మెంట్ల వారీగా పంపాలని కూడా ఈ ఏడాది జనవరిలోనే సర్కారు స్పష్టంచేసింది. ఆ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తోపాటు బీసీ, జనరల్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల ఉన్నతాధికారులు సైతం అందుకు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఫైల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీచర్ల బదిలీల పక్రియ పూర్తయింది. కానీ, గురుకులాలకు సంబంధించి ఫైల్ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పంపిన ఫైల్‌పై జీఏడీ కొర్రీలు పెట్టింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని, అనేక లోపాలున్నాయని పేర్కొంటూ, వాటన్నింటిని పునఃసమీక్షించి, ఫైల్‌ను మరోసారి పంపాలని సొసైటీకి తిరిగి పంపింది. ఆ ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సొసైటీ సెక్రటరీ వద్దకు చేరింది. ఇప్పటికీ ఫైల్‌పై సొసైటీ నుంచి ఎలాంటి కదలిక లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జీఏడీ ఎస్సీ గురుకుల సొసైటీ మళ్లీ ఫైల్‌ను పంపలేదు. ఆ ఫైల్ ఎక్కడ ఉన్న సంగతి తెలియని దుస్థితి నెలకొన్నది. సొసైటీ గురుకులంలో దాదాపు 130 మంది ఉద్యోగులు 317 కింద దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం విధించిన గడువు మరో మూడు రోజుల్లో ముగియనున్నదని, కానీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆదినుంచీ సొసైటీ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం అవకాశం కల్పించినా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి జీవో-317 బాధితులకు న్యాయం చేయాలని గురుకుల టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
బదిలీల అంశమే కాకుండా డీఏ ఏరియర్స్‌ను కూడా ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టింది. ఎస్సీ గురుకుల సొసైటీ టీచర్లు, ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ కలిపి దాదాపు రూ.24.58 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది. రెండేండ్లుగా వాటిని చెల్లించని దుస్థితి నెలలొన్నది. ఇప్పటికీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గురుకుల టీచర్లు వాపోతున్నారు. ఇకనైనా స్పందించి బకాయిలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటాలకు దిగక తప్పదని గురుకుల ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.