కన్నీటి పంచనామా!.. ఎంఎల్సీ కేసులతో బాధితుల గగ్గోలు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టు దవాఖానల్లో నమోదవుతున్న మెడికో లీగల్ కేసుల్లో నిబంధనల పేరిట పోలీసులు, అధికారులు అనుసరిస్తున్న వైఖరి బాధితుల ను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. ప్రమాదా లు, హత్యలు, ఆత్మహత్యల వంటి అసహజ మరణాలు సంభవిస్తే.. దవాఖానల్లో వీటిని మెడికో లీగల్ కేసులుగా నమోదు చేస్తున్నారు.
- గుండెకోతను మిగిలుస్తున్న నిబంధనలు
- మృతుల కుటుంబసభ్యులే ఫిర్యాదు చేయాలి
- పంచనామాకు ఆ స్టేషన్ కానిస్టేబులే రావాలి
- ఎంఎల్సీ కేసుల్లో ప్రైవేటు దవాఖానల నిర్లక్ష్యం
- నాలుగు కమిషనరేట్లలో పోస్టుమార్టానికి గాంధీ, ఉస్మానియా దవాఖానలే దిక్కు
- వికేంద్రీకరణపై దృష్టి పెట్టని ప్రభుత్వం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవే టు దవాఖానల్లో నమోదవుతున్న మెడికో లీగల్ కేసుల్లో నిబంధనల పేరిట పోలీసులు, అధికారులు అనుసరిస్తున్న వైఖరి బాధితుల ను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. ప్రమాదా లు, హత్యలు, ఆత్మహత్యల వంటి అసహజ మరణాలు సంభవిస్తే.. దవాఖానల్లో వీటిని మెడికో లీగల్ కేసులుగా నమోదు చేస్తున్నారు. వారి మృతదేహాన్ని స్వాధీనం చేసేందుకు అటు దవాఖానల యాజమాన్యం, ఇటు పోలీసులు నిబంధనల పేరిట సాగిస్తున్న తంతు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని బాధితులు వాపోతున్నారు. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని నిబంధనల పేరిట ఆయా వ్యవస్థలు మరింత గుండెకోతకు మిగిలిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గత నెలలో ఓ టీవీ న్యూస్ చానల్లో పనిచేసే సబ్ఎడిటర్ మోటర్‌సైకిల్‌పై వెళ్తూ నగరశివార్లలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతడిని సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అతని వద్దనున్న సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల సమ్మతితో బాధితుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆ మేరకు ఫీజు వసూలు చేశారు. ఆ తరువాత రోజూ దవాఖాన బిల్లు భారీగా వస్తుండటంతో కుటుంబసభ్యులు బాధితుడిని నిమ్స్‌కు తరలించారు. పదిరోజులపాటు మృత్యువుతో పోరాడిన బాధితుడు చివరికి తుదిశ్వాస విడిచాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించగానే అసలు సమస్య మొదలైంది.
ప్రైవేట్ దవాఖాన యాజమాన్యం దీనిని మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా నమోదు చేయడంతో.. పోలీసులు వచ్చి పంచనామా చేసేవరకు మృతదేహాన్ని అప్పగించేది లేదని నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది స్పష్టంచేశారు. దీంతో మృతుడి పాత్రికేయ మిత్రులు కొందరు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించగా.. అసలు ఘటనకు సంబంధించిన సమాచారమేదీ తమకు అందలేదని పోలీసులు చెప్పారు. వెంటనే బాధితుడిని మొదట చేర్చిన ప్రైవేట్ దవాఖానను సంప్రదించగా.. తాము పోలీసులకు సమాచారమివ్వలేదని తెలిపారు. ఎంఎల్సీ కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించగా.. ఆ రోజున ఉన్న నైట్‌షిఫ్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటారని అన్నారు. ఇంటివద్దనున్న ఆ నైట్‌షిఫ్ట్ సిబ్బందిని సంప్రదించగా.. వారే వేరొక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
ఈ విషయాన్ని వారు దవాఖాన రికార్డుల్లో నమోదు చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. తీరా సంబంధిత పోలీస్‌స్టేషన్ వారిని సంప్రదిస్తే.. మృతుడి భార్య లేదా కుమార్తె/కుమారుడు వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేయాలని, అప్పుడే పంచనామా కోసం కానిస్టేబుల్‌ను పంపుతామని అన్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులెవరూ రాలేరని, బంధువులు వచ్చి ఫిర్యాదు చేస్తామంటే.. పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో చేసేది లేక మృతుడి కుమారుడిని హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు పంపారు. బాధితుడు ఉదయం 8.30 గంటలకు మరణించగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇక పోలీస్‌స్టేషన్‌లో పంచనామా పత్రం రాయడానికి రెండు గంటలు తీసుకున్నారు.
ఈ ప్రక్రియలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిని గంటన్నరపాటు ప్రశ్నలతో వేధించారు. అనంతరం స్టేషన్‌లోని కంప్యూటర్లో సిద్ధంగా ఉన్న ఫార్మాట్లో మృతుడి పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలు నమోదు చేసి ప్రింట్ ఇవ్వడానికి మరో గంట తీసుకున్నారు. ఇక ఆ పత్రం పై ఇన్స్పెక్టర్ సంతకం చేయడానికి మరికొంత జాప్యం జరిగింది. పంచనామా పత్రంతోపాటు ఓ కానిస్టేబుల్‌ను తీసుకొని నిమ్స్‌కు చేరేసరికి సాయంత్రం 6.30 దాటింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తీసుకెళ్లాలని, అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాతే అప్పగిస్తానని కానిస్టేబుల్ చెప్పాడు.
కానీ గాంధీ దవాఖానలో సాయంత్రం 6 గంటల తరువాత పోస్ట్‌మార్టం చేయడం నిలిపివేస్తారు. దీంతో మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించి మరుసటి రోజు వరకూ వేచి చూడక తప్పలేదు. ఆ మరుసటి రోజు కూడా కానిస్టేబుల్ వచ్చే వరకూ పోస్ట్‌మార్టం చేసేది లేదని గాంధీ వైద్య సిబ్బంది అ న్నారు. ఇక ఆ కానిస్టేబుల్ తనకు తీరిన సమయంలో వచ్చి కావాల్సిన వివరాలు అందించిన తరువాత పోస్ట్‌మార్టం నిర్వహించారు. వైద్యసిబ్బంది, పోలీసులు అందరూ నిబంధనల ప్రకారమే పనిచేశామని చెప్పారు.. కానీ 48 గంటలపాటు ఆ కుటుంబం అనుభవించిన నరకయాతనను ఎవరూ పట్టించుకోలేదు.
పోలీసులను, వైద్య సిబ్బందిని ప్రభావితం చేయగల ఓ పాత్రికేయుని కుటుంబానికే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు లేదా హత్యకు గురై మరణాలు సంభవిస్తే, అది మెడికో లీగల్ కేసుగా నమోదైతే వారి కుటుంబాలన్నీ ఎంతో కఠినమైన ఈ తంతును తప్పనిసరిగా ఎదుర్కొంటున్నారు. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని నిబంధనల పేరిట ఆయా వ్యవస్థలు మరింత గుండెకోతకు గురిచేస్తున్నాయి. అటు ప్రైవేటు దవాఖానల సిబ్బంది, ఇటు పోలీసులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించే తీరు బాధితులను మరింత వేదనకు గురిచేస్తున్నది. ప్రైవేటు దవాఖానకు వచ్చే మెడికో లీగల్ కేసు గురించి వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వాలి.
పోలీసులు ఆయా కేసుల తీవ్రతను బట్టి డైయింగ్ డిక్లరేషన్ (మరణ వాంగ్మూలం) తీసుకోవాలి. ఈ మరణవాంగ్మూలం బాధిత కుటుంబానికి చట్టపరంగా ఎంతో కీలకం. కానీ అధిక సంఖ్యలో ప్రైవేటు దవాఖానలు పోలీసులకు సమాచారం ఇవ్వడంలేదు. మరణాలు సంభవించినప్పు డు, అది తమ మెడకు చుట్టుకుంటుందని భావించినప్పుడు మాత్రమే ఎంఎల్సీగా నమోదుచేస్తున్నారు. దవాఖాన యాజమా న్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే మరణ వాంగ్మూలం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
భారమంతా కుటుంబంపైనే..
దవాఖానలో ఎంఎల్సీగా నమోదైన వ్యక్తి మరణిస్తే.. నిబంధనల పేరిట ఆయా వ్యవస్థలు ఆ కుటుంబాన్ని నరకయాతనకు గురిచేస్తున్నాయి. సుదూర ప్రాంతాల్లోని జిల్లాల్లో ఇటువంటి ఘటనలు జరిగితే బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుంటా రు. ఒకవేళ బాధితులు హైదరాబాద్‌లో మరణిస్తే.. ఘటన జరిగిన ప్రాంతానికి చెందిన పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించే వర కూ మృతదేహాన్ని అప్పగించే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో మరణిస్తే.. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి, ఆ పోలీసులు ఇక్కడికి రావడానికే కనీసం 36 గంటలు పడుతుంది. అప్పటిదాకా మృతదేహాన్ని మార్చురీలో ఉంచి పోలీసుల కోసం ఎదురుచూడాల్సిందే.
రెండే దవాఖానలు!
హైదరాబాద్‌లోని రెండు దవాఖానలు గాంధీ, ఉస్మానియాలో మాత్రమే పోస్ట్‌మార్టం నిర్వహించే వెసులుబాటు ఉన్నది. దీంతో వాటి మార్చురీల్లోని కోల్డ్ స్టోరేజీల్లో స్థలం లేక మృతదేహాలను నేలపైనే ఉంచుతున్నారు. దీంతో అవి కుళ్లిపోతున్న ఘటనలు అనేకం. డబ్బున్న వాైళ్లెతే ఫ్రీజర్‌ను అద్దెకు తెచ్చుకొని అందులో ఉంచుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లతోపాటు ప్యూచర్సిటీలోని కొన్ని పోలీస్స్టేషన్లకు సంబంధించిన వివిధ కేసుల్లోని మృతదేహాలను ఈ రెండు దవాఖానలకే తరలించాలి. ఈ దవాఖానల వద్ద పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను తీసుకొచ్చే అంబులెన్స్‌లు రోజూ 10 నుంచి 20 వరకు క్యూలో ఉంటాయి. ఇక పోస్టుమార్టం ప్రక్రియకు కనీసం అరగంట నుంచి గంట సమయం పడుతుంది. సిబ్బంది కొరత కారణంగా గాంధీలో 15 నుంచి 20, ఉస్మానియాలో 10 నుంచి 15 వరకు మృతదేహాలకు రోజూ పోస్టుమార్టం జరుగుతుంటాయి. మధ్యాహ్నం తరువాత ఓ వ్యక్తి మరణిస్తే.. అతడి మృతదేహాన్ని మరుసటి రోజు సాయంత్రమే అప్పగించే పరిస్థితి నెలకొంది. ఇది జాగరణ కాదు.. వ్యవస్థ విధిస్తున్న క్రూరమైన శిక్ష అని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలకు పరిష్కారం ?
- ప్రధానంగా ఎంఎల్సీ కేసులకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వని దవాఖానల అనుమతి రద్దు చేసేవిధంగా నిబంధనలను రూపొందించాలి.
- కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో 24 గంటలూ పోస్టుమార్టం నిర్వహించే వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతున్నది. కర్ణాటకలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లోని పద్ధతులపై అధ్యయనం చేసి.. అవసరమైతే మన దగ్గర కూడా అమలు చేయాలి. హైదరాబాద్ శివారులో ఉండే ఏరియా దవాఖానలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ పోస్టుమార్టం నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేస్తే గాంధీ, ఉస్మానియాలపై భారం తగ్గుతుంది.
- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 24/7 పోస్టుమార్టం చేసే అవకాశమున్నా.. ఇది జీవన్‌ధాన్ ప్రోగ్రామ్‌కు సంబంధించి, సంచలనాత్మకమైన కేసుల్లో దర్యాప్తు అధికారి సమక్షంలో వీడియోగ్రఫీతో జరుగుతుంది. అది అన్ని కేసుల్లో సాధ్యం కావడం లేదు. తగిన సిబ్బందిని నియమించి మూడు షిఫ్ట్‌ల్లో పోస్టుమార్టం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి.
- పోస్టుమార్టం నివేదికలు త్వరగా వచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి, అవినీతిని అంతమొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

