హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురవుతున్నది. ఈ అకాడమీని పట్టించుకునే వారే కరువయ్యారు. 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓయూలో సివిల్స్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనిలో ఒకేసారి వెయ్యి మందికి కోచింగ్ ఇచ్చేలా మౌలిక వసతులు సైతం కల్పించింది.
కానీ ఇప్పుడా ఆ అకాడమీని కేవలం 250 మంది విద్యార్థులకు మాత్రమే పరిమితం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండు బ్యాచ్లు కూడా పూర్తి చేయలేదు. అధికారులను అడిగితే సమాధానాలు దాటవేస్తున్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎం కుమార్ సైతం ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. కాగా ఈ సివిల్స్ అకాడమీలో చేరడానికి ముందుకు రావడం లేదని వర్సిటీ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
సివిల్ సర్వీసెస్ అకాడమీలో అడ్మిషన్ల కోసం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కనీసం ఆ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వీలైనంత త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మాత్రమే చెబుతున్నారు. కేవలం ఓయూ క్యాంపస్లో చదివే బీసీ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ శిక్షణ ఇవ్వాలని వర్సిటీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ అకాడమీని బలోపేతం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని బీఆర్ఎస్వీతోపాటు పలు విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.