అలంపూర్, అక్టోబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు అరిగోస పడ్తున్నారు. మొన్నటి వరకు అధిక వర్షాలతో పంటలు దెబ్బతినగా.. నేడు దిగుబడి వచ్చినా ధరల్లేక ఆందోళన చెందుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారుమునగాల-2 గ్రామానికి చెందిన చిన్న శ్రీనివాసులు తనకున్న మూడెకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు.
ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టబడికి ఖర్చు చేశాడు. దిగుబడి వచ్చాక విక్రయిద్దామంటే ధరలు పడిపోయాయి. మార్కెట్లో క్వింటా ధర రూ.400 పలుకుతున్నది. పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకెళ్లినా గిట్టుబాటు కాదని ఉల్లిని మేతకు వదిలేశాడు. శుక్రవారం గొర్రెలు మేస్తుండడంతో రైతు గుండె తరుక్కుపోయింది. ఒక్క శ్రీను పరిస్థితే కాదు.. ఇలా ఎందరో రైతులు పెట్టుబడి కూడా రాక మధనపడుతున్నారు.